శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన పాండెనవాగు పరిధిలో కొనసాగుతున్న SNDP పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం నిర్వహించిన పర్యటనలో జోనల్ కమిషనర్, చీఫ్ ఇంజనీర్‌తోపాటు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో పనుల పురోగతి, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలను అధికారులు కమిషనర్‌కు వివరించారు. పర్యటనలో భాగంగా నాలా అలైన్‌మెంట్, వెడల్పు, ఆక్రమణల తొలగింపు తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. నాలా మార్గం, వెడల్పుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలతో పాటు, ప్రతిపాదిత పనులకు అవసరమైన ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపుపై అధికారులతో సమీక్షించారు.

మారిచెట్టు జంక్షన్ వద్ద బల్కాపూర్ నాలాపై ఉన్న ఆక్రమణలను పరిశీలించిన కమిషనర్.. మారిచెట్టు నుంచి పంచవటి కాలనీ వరకు ప్రతిపాదించిన రోడ్డు విస్తరణ పనులపై అధికారులతో చర్చించారు. పనులను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన క్షేత్రస్థాయి చర్యలను పరిశీలించారు. అదేవిధంగా విజేత సూపర్‌మార్కెట్ నుంచి చిత్రపురి మోడల్ రోడ్డు వరకు నాలా వెంబడి ప్రతిపాదించిన స్లిప్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ మార్గాన్ని రోడ్-కమ్-బాక్స్ డ్రెయిన్‌గా అభివృద్ధి చేసే ప్రతిపాదనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచవటి కాలనీ వద్ద షేక్‌పేట్ నాలా డైవర్షన్ పాయింట్‌ను కూడా కమిషనర్ పరిశీలించారు. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి, తదుపరి చర్యలకు సంబంధించి సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించి అవసరమైన పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. SNDP పనుల్లో సకాలంలో పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.





