శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి-శేరిలింగంపల్లి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు జాబితాలను తిరిగి (De-novo) తయారు చేయనున్నట్లు ఉప కమిషనర్ తెలిపారు. ఓటర్ల నమోదు నియమాలు–1960లోని రూల్ 31(3) ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఓటరుగా నమోదు కావడానికి అర్హులైన పట్టభద్రులు ఫారం–18 ద్వారా తమ దరఖాస్తులను సంబంధిత ఎన్నికల నమోదు అధికారి (ERO), సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO) లేదా నియమిత అధికారులకు నవంబర్ 6 లోపు సమర్పించాలని అధికారులు సూచించారు.

ఓటరుగా నమోదు కావాలంటే.. దరఖాస్తుదారు భారతదేశ పౌరుడై ఉండాలి. సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసిగా ఉండాలి. 01 నవంబర్ 2026 నాటికి కనీసం మూడు సంవత్సరాల క్రితం పట్టభద్రుడై ఉండాలి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఫారం–18తో పాటు డిగ్రీ సర్టిఫికేట్, మార్కుల మెమో లేదా ఇతర సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకునే వారు అసలు ధ్రువపత్రాలను నియమిత అధికారికి చూపించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత ERO, AERO లేదా నియమిత అధికారుల వద్ద సమర్పించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితాలను ప్రతి ఎన్నికకు ముందు కొత్తగా తయారు చేస్తారని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్న పట్టభద్రులు కూడా తప్పనిసరిగా మళ్లీ ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిర్ణీత గడువులోగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఉప కమిషనర్ కోరారు.





