శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజనను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయని మల్లారెడ్డి ఆరోపించారు. 500, 1,000, 2,000, 3,000, 4,000 గజాల స్థలాల్లో 10 నుంచి 11 అంతస్తుల వరకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ వాటిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో 50, 100 గజాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, పెద్ద నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అనుమతులు లేని భవనాల్లో బిల్డర్ల మాయలో పడి అమాయకులు ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారని మల్లారెడ్డి తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత అధికారులు చర్యలు తీసుకుంటే చివరికి నష్టపోయేది ఫ్లాట్లు కొనుగోలు చేసిన సామాన్య ప్రజలేనని అన్నారు. నిర్మాణ దశలోనే అక్రమ నిర్మాణాలను గుర్తించి నిలిపివేస్తే ప్రజలు మోసపోకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే నిలిపివేయాలని, అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమైతే, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయ్యప్ప సొసైటీ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దృష్టి సారించాలని మల్లారెడ్డి కోరారు. మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ, ఏసీపీ హబీబున్నిసాపై కూడా తగిన చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.





