శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నల్లగండ్లలో పెద్దలకు బియ్యం ఇవ్వడం, దేవాలయంలో గంట కట్టే కార్యక్రమాలను నిర్వహించారు. వర్టెక్స్ కింగ్‌స్టన్ పార్క్ విల్లాస్ క్లబ్‌హౌస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సీనియర్ నాయకులు, పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.

ముందుగా రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభలో పలువురు మాట్లాడుతూ రాగం కుటుంబంలో తీరని విషాదం నెలకొందని పేర్కొన్నారు. మే 9, 1996 నుంచి మూడు దశాబ్దాలకు పైగా రాగం నాగేందర్ యాదవ్ జీవితంలో, ప్రజా సేవలో సుజాత యాదవ్ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. 2000–2005 మధ్య కౌన్సిలర్‌గా, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గా రెండు పర్యాయాలు సేవలందించిన ఆమె మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కుట్టు శిక్షణ కార్యక్రమాలు, కుట్టు మిషన్ల పంపిణీ, ఉచిత వైద్య శిబిరాలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేను.. నీ జ్ఞాపకాలతోనే ఇక నా మిగిలిన ప్రయాణం.. మీ కోరిక మేరకు ఇక నా జీవితం ప్రజా సేవకే అంకితం అని భావోద్వేగానికి లోనయ్యారు.

సుజాత యాదవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంప్రదాయ ప్రకారం పెద్దలకు బియ్యం ఇవ్వడం, దేవాలయంలో గంట కట్టే కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. పెద్దల ఆశీస్సులు ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





