కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను పాతరేస్తారా?

శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందంటూ బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాలను తక్షణమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కృష్ణారావు దిశానిర్దేశంలో BSN కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మియాపూర్ 108వ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. మాజీ కార్పొరేటర్ రంగా రావు, తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, గోపరాజు శ్రీనివాసు, కలిదిండి రోజా, కుంచె శివరాజ్, మహమ్మద్ జాంగిర్, శ్రీను, వంశీతో పాటు పెద్ద సంఖ్యలో మియాపూర్ మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోగా, గతంలో అమలైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాలను కొనసాగించకపోవడం వల్ల పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ర్యాలీలో పాల్గొన్న మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తులం బంగారానికి ఆశపడి కేసీఆర్ ప్రభుత్వాన్ని వదులుకున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి షరతులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు నినాదాలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించకపోతే ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు. పేదల సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here