నమస్తే శేరిలింగంపల్లి: అంజయ్య నగర్ లో ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయని, అభివృద్ధి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. బస్తీబాటలో భాగంగా అంజయ్యనగర్ లో బిజెపి నాయకులు బస్తీబాట చేపట్టి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఇష్టారీతిగా బెల్టు షాపులు నడుపుతున్నారని, ఎక్సైజ్ అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో పిల్లల కోసం అంగన్ వాడీ కేంద్రం కోసం స్థలం కేటాయించిన నేటికి భవన నిర్మాణం చేపట్టలేదన్నారు. ఆ స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తిచూడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రవికుమార్ యాదవ్ చెప్పారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు. ఆయన వెంట బిజెపి నాయకులు, స్థానికులు ఉన్నారు.