శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతిభకు కులం, ప్రాంతం, పేదరికం అడ్డుకాదని గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా-1975) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న గౌడ్ అన్నారు. విద్యే విజయానికి పునాది అని, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. గోపా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బండి సాయన్న గౌడ్ విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

విద్య అంటే కేవలం అక్షరజ్ఞానం సంపాదించడం, ఉద్యోగం పొందడం మాత్రమే కాదని డాక్టర్ బండి సాయన్న గౌడ్ పేర్కొన్నారు. మంచి చెడులను గుర్తించే విచక్షణ, సమాజం పట్ల బాధ్యత, పెద్దల పట్ల గౌరవం, మానవత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం వంటి విలువలను విద్య పెంపొందిస్తుందని వివరించారు. ఆర్థిక స్వావలంబనతో పాటు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించేందుకు విద్య దోహదపడుతుందని అన్నారు. చదువు అనేది ఉద్యోగం సంపాదించేందుకు మాత్రమే కాకుండా సంస్కారం, జ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంపొందించే సాధనమని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించగలిగే నిజమైన ఆస్తి నాణ్యమైన విద్యేనని పేర్కొంటూ, పిల్లలను ఉన్నతంగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

గౌడ సమాజానికి చెందిన విద్యార్థులు విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, విజ్ఞానం, సాంకేతిక రంగాల్లో రాణించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారి విజయాలను సమాజానికి పరిచయం చేస్తూ మరింత ముందుకు సాగేలా ప్రోత్సహించడం గోపా వంటి సంస్థల బాధ్యత అని అన్నారు. ప్రతిభా పురస్కారాలు విద్యార్థుల్లో మరిన్ని విజయాలు సాధించాలనే తపనను పెంచుతాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని, వారు చేసిన త్యాగాలను గుర్తించి ఆదరించాలని అన్నారు. తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, కుటుంబ విలువలను కాపాడుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.
గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమ విద్యాభ్యాస సమయంలో విద్యార్థులను ప్రోత్సహించే సంస్థలు, వ్యక్తులు పరిమితంగా ఉన్నప్పటికీ పట్టుదలతో చదివి రాష్ట్ర స్థాయికి ఎదిగామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు విద్యాసంస్థలు, గోపా వంటి సంస్థల సహకారం కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందేలా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యావంతమైన సమాజమే దేశానికి బలమైన పునాది అని పేర్కొంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఐక్యతతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో అభివృద్ధి పథంలో పయనించే గౌడ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిది శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యల్మకంటి మీరయ్య గౌడ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ రంజిత్ గౌడ్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి గండు యాదగిరి గౌడ్, డాక్టర్ గోపగాని సురేందర్ గౌడ్, కత్తి నెహ్రూ గౌడ్, అమరగాని వెంకన్న గౌడ్, డాక్టర్ శ్రీదేవి గౌడ్, డాక్టర్ శివాజీ గౌడ్, డాక్టర్ నల్లమాస కృష్ణ గౌడ్, అడ్వకేట్ తిరుమల రావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





