శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మటన్ మండిలో పుచ్చిపోయిన దంతం కనిపించిందని ప్రశ్నించిన కస్టమర్కు రెస్టారెంట్ యాజమాన్యం నుంచి బెదిరింపులు ఎదురైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి. మాదాపూర్లోని ది జాయింట్ అల్ మండి’ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు పేర్కొన్నాడు. రెస్టారెంట్లో మటన్ మండిని తింటుండగా ఆహారంలో పుచ్చిపోయిన దంతం కనిపించడంతో కస్టమర్ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన యాజమాన్యం.. ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి, బెదిరింపులకు దిగినట్లు బాధితుడు ఆరోపించాడు.

ఈ ఘటనపై బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు వచ్చి విచారణ జరపాల్సి ఉండగా, ఫుడ్ ఇన్స్పెక్టర్ నిహారిక ఫోన్లో మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించినట్లు బాధితుడు ఆరోపించాడు. గంటలు గడుస్తున్నా అధికారులు ఘటనాస్థలికి చేరుకోలేదని పేర్కొన్నాడు. రెస్టారెంట్ యజమాని చిరంతన్ రెడ్డి, సిబ్బంది తనకు అధికారుల అండదండలు ఉన్నాయని చెబుతూ ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితుడు ఆరోపించాడు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఫిర్యాదు చేసిన వినియోగదారుడికి న్యాయం చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సమగ్ర విచారణ జరిపి, ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






