సైబరాబాద్‌లో షీ టీమ్స్ దూకుడు.. వారం రోజుల్లో 37 మంది పట్టివేత

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహిళలు, చిన్నారుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలోని షీ టీమ్స్ విస్తృతంగా చర్యలు చేపట్టాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 116 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి, అసభ్యకర చర్యలు, ఈవ్‌టీజింగ్, మహిళల వేధింపులకు పాల్పడుతున్న 37 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిపై 56 పెట్టీ కేసులు నమోదు చేసినట్లు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ వెల్లడించింది. మహిళల నుంచి వివిధ మార్గాల ద్వారా 15 ఫిర్యాదులు కూడా అందినట్లు తెలిపింది. సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) అధికారులు ముగ్గురు బాధితులను రక్షించి, PTIA కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, CDEW కేంద్రాల ద్వారా కుటుంబ వివాదాల్లో జోక్యం చేసుకుని 33 కుటుంబాలను తిరిగి కలిపేందుకు ప్రయత్నాలు చేసినట్లు అధికారులు తెలిపారు.

మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన పెంచేందుకు AHTU, షీ టీమ్స్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో 340 మంది పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, బాల్య వివాహాలు, బాలల హక్కులు, బాల కార్మికులు, స్టాకింగ్, భిక్షాటన, సైబర్ బుల్లీయింగ్, సైబర్ మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, డయల్ 100/112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 సేవలపై కూడా వివరించారు.

సైబరాబాద్ పోలీస్ షీ టీమ్స్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సహకారంతో సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో న్యూ రిలిక్ సంస్థ ఉద్యోగినుల కోసం మహిళల అవగాహన, స్వీయ రక్షణ బూట్‌క్యాంప్ నిర్వహించారు. ఇందులో 40 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇన్‌స్పెక్టర్ వై. హనుమాన్ గౌడ్, మహిళా ఎస్‌ఐ అంబికా, షీ టీమ్స్ అధికారులు మహిళల చట్టపరమైన హక్కులు, ఫిర్యాదు చేసే విధానాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. SCSCకి చెందిన రష్మి డిజిటల్ భద్రత, కమ్యూనిటీ–పోలీస్ భాగస్వామ్యం ప్రాముఖ్యతను వివరించారు. రుద్రమదేవి అకాడమీ ఆధ్వర్యంలో మహిళలకు అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే ప్రాక్టికల్ సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. మహిళలకు సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన వాతావరణం కల్పించడంలో సహకరిస్తున్న న్యూ రిలిక్, SCSC సంస్థలకు సైబరాబాద్ పోలీసులు అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here