శేరిలింగంపల్లి, అక్టోబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామం లో నిర్వహిస్తున్న గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్–2026 సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రియల్ ఎక్స్‌టెన్షన్ కట్టెజ్ ఇండెక్స్–సి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవంలో గుజరాత్‌కు చెందిన హస్తకళలు, కళారూపాలను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని విష్ణుప్రియ బృందం దేశభక్తి గీతాలను ఆలపించింది. వైష్ణవ జనతో, రఘుపతి రాఘవ రాజారామ్ తదితర గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.

అనంతరం వర్షిణి బృందం ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పుష్పాంజలి, ఆనంద నర్తన గణపతిమ్, జతిస్వరం, రామ శబ్దం, స్వాగతం కృష్ణ, దేవి స్తుతి, అభంగ్, శివస్తుతి, అన్నమాచార్య కీర్తనలు తదితర అంశాలను కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో యహ్వి, హాసిని, తరుణి, కీర్తి, పూర్వి, జుహిక, మాన్విష, తన్వి, రుద్ర తదితర కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు శిల్పారామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.






