శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన బుధవారం ఉదయం బాలాజీనగర్‌లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులతో కలిసి పౌర మౌలిక వసతులు, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా విజయదుర్గ టిఫిన్ సెంటర్ రోడ్, వార్డు ఆఫీస్ రోడ్‌లలో పూర్తయిన సీసీ రోడ్డు పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ రెండు రోడ్డు పనులను సుమారు రూ.66 లక్షల అంచనా వ్యయంతో చేపట్టినట్లు అధికారులు వివరించారు.

అదేవిధంగా రోడ్లు, ప్రజా స్థలాలకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలను గుర్తించి, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్‌ను కమిషనర్ ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు, ప్రజా స్థలాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు కమిషనర్ సూచించారు. ముఖ్యంగా ప్రజల రాకపోకలు, మౌలిక వసతులు, పౌర సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను సకాలంలో గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు.





