అనధికార నిర్మాణాలపై సీఎంసీ కొరడా.. 16 నిర్మాణాలు కూల్చివేత

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు ముమ్మరమయ్యాయి. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించేందుకు మూడు జోన్లలో సీఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, చర్యలు చేపట్టాయి. తాజాగా చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల్లో 16 అనధికార నిర్మాణాలను కూల్చివేశారు. మరో 3 నిర్మాణాలకు నోటీసులు జారీ చేయగా, ఒక అనధికార నిర్మాణాన్ని సీజ్ చేశారు. జోన్‌ల వారీగా చేపట్టిన కూల్చివేతలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్ – 6, కూకట్‌పల్లి జోన్ – 4, కుత్బుల్లాపూర్ జోన్ – 6 నిర్మాణాల‌ను కూల్చివేశారు. మూడు జోన్లలో అనధికార నిర్మాణాల గుర్తింపు నుంచి తదుపరి చర్యల వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో కొనసాగిస్తున్నట్లు సీఎంసీ అధికారులు తెలిపారు. గుర్తించిన ప్రతి కేసులో నిర్దేశిత విధానం, అమల్లో ఉన్న భవన నిర్మాణ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నారు.

అనధికార నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, నిబంధనల మేరకు సకాలంలో చర్యలు తీసుకోవాలని సీఎంసీ కమిషనర్ సృజ‌న సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఆదేశించారు. మూడు జోన్లలో సమన్వయంతో తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. నగరంలో భవన నిర్మాణ నిబంధనల అమలు, క్రమబద్ధమైన పట్టణ అభివృద్ధిని నిర్ధారించే లక్ష్యంతో తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here