చందానగర్ సీఎంఎస్ కాలేజీపై ఫీజు వసూళ్ల ఆరోపణలు.. ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సీఎంఎస్ కాలేజీ యాజమాన్యం అడ్మిషన్ల విషయంలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. గత రెండు సంవత్సరాలుగా కాలేజీ యాజమాన్యం మార్కెటింగ్ నిర్వహిస్తూ, తమ ప్రతినిధుల ద్వారా అడ్మిషన్ కోసం రూ.85,000 తీసుకున్న అనంతరం, విద్యార్థి కాలేజీలో చేరిన తర్వాత రూ.1,25,000 ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు సంబంధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ విషయంపై తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పటికీ స్పందించలేదని తెలిపారు. అంతేకాకుండా, ప్రశ్నించిన తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంటనే ఫీజు చెల్లించాలని, లేకపోతే తమ పిల్లలకు టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్) ఇస్తామని ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న పోరెడ్డి బుచ్చిరెడ్డి కాలేజీని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో మాట్లాడి, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. కాలేజీ యాజమాన్యం ఫీజు వసూళ్లపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here