మాతృభాషను కాపాడుకోవడం మనందరి బాధ్యత: డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు

చందాన‌గ‌ర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాతృభాష అమ్మలా ప్రేమను పెంచుతుంద‌ని, మాతృభాష‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కుండా కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని రాష్ట్ర బీసీ కమిషన్ పూర్వ సభ్యులు, రచయిత డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. మాతృభాష పరిరక్షణ సమితి భాగ్యనగరం ఆధ్వర్యంలో చందానగర్ లోని సరస్వతీ విద్యా మందిర్ ప్రాంగణంలో సోవారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ మావిశ్రీ మాణిక్యం, అధ్యక్షత వహించగా, గౌరవ సలహాదారులు డీ వీ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణ రావు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు సాహితీ రంగంలో విశిష్ట సేవ‌లు అందిస్తున్న వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు మాతృభాషా విశిష్ట సేవా పురస్కారాన్నికార్పొరేట‌ర్లు వి.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, మంజుల ర‌ఘునాథ్‌రెడ్డిల చేతుల మీదుగా అంద‌జేశారు.

వకుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావుకు మాతృభాష విశిష్ట సేవా పుర‌స్కారాన్ని అంద‌జేస్తున్న దృశ్యం

అనంత‌రం డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ భాష అంతరించిపోతే ఆ జాతులకు జాతులు నశించిపోతున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు ఒక భాష యొక్క సాహిత్యం, సంస్కృతి , సంప్రదాయాలు కళలు భాష తో పాటే కనుమరుగవుతాయని ఆయన అన్నారు. మన మాతృభాష తెలుగు విస్తృతికి ఎందరో భాషాకారులు, సాహితీవేత్తలు తమ జీవితాలను త్యాగం చేసి తెలుగును శాఖోపశాఖలుగా విస్తరింపచేశారన్నారు. సి.పి.బ్రౌన్ మొదలుకొని కందుకూరి వీరేశలింగం పంతులు, బహుజనపల్లి సీతారామాచార్యులు, జయంతి రామయ్య పంతులు, గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, కొక్కొండ వెంకటరత్నం పంతులు, వేదం వెంకటరామ శాస్త్రి, వావికొలను సుబ్బారావు, కాశీభట్ల సోదరులు, తిరుపతి వెంకట కవులు, పుట్టపర్తి నారాయణాచార్యులు, సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజ చార్యులు, మాడపాటి హనుమంతరావు, కురగంటి సీతారామ భట్టాచార్యులు వంటి ప్రముఖులు తెలుగు వెలుగును దశదిశలా చాటారని తెలిపారు. అంతకుముందే పరవస్తు చిన్నయసూరి బాల వ్యాకరణం, నీతి చంద్రికలతో భాషను వ్యాకరణయుతం చేశారన్నారు. ఆధునిక కాలంలో అధ్యయనశీలురు, పరిశోధకులు, భాషావేత్తలు ఆ ముద్రితాలుగా మౌఖికంగా ప్రచారంలో ఉన్న సాహిత్యాన్ని సాధికారికంగా శతక, హరికథ, జానపద, నవలా వాజ్మయాలను వెలుగులోకి తెచ్చారన్నారు. సమగ్రంగా సాహిత్యాన్ని ఆరుద్ర వెలువరించారన్నారు. ఖండవల్లి లక్ష్మీ రంజనం, తూమాచి దోణప్ప, బిరుదురాజు రామరాజు, సినారె, పాటిబడ్డ మాధవ శర్మ, శ్రీ శ్రీ , విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, రావూరి భరద్వాజ, దాశరధి ఎందరో మహానుభావులు మాతృభాషకు పట్టాభిషేకం చేశారన్నారు.

కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తున్న డా.వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావు

తెలుగు భాష ప్రాచీన ప్రాశస్త్యం కలిగిన భాషగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిందని అన్నారు. మాతృభాష పట్ల చిన్ననాటి నుండే మక్కువ కలిగించాలంటే తెలుగులోనే సాధ్యమైన ప్రతి సందర్భంలో సంభాషించాలన్నారు. గొప్ప వాళ్ళు రాసిన రచనలు, పద్యాలు, గద్యాలు , గేయాలు , కథలు, కవితలు ,పల్లె గీతాలు, హాస్స రచనలు మున్నగునవి చదవాలని, చదివించే అలవాటును జీవితంలో ఒక దినచర్యగా ఉండేలా చూసుకోవాలని డాక్టర్ వకుళాభరణం సూచించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త తల్లోజు యాదవ్ ఆచారి, మాతృభాష పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు ఉరిటి వెంకట్రావు ప్రజాపతి, ముఖ్య సలహాదారు గంటా మనోహర్ రెడ్డి, శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాలక కార్యదర్శి యం. రఘునందన్ రెడ్డి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, సుప్రజా ప్రవీణ్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ దాసోజు పద్మావతి, వజిద్ బేగ్ మగ్బుల్, మాడుగుల లక్ష్మీ నరసమ్మ, రజనీ కులకర్ణి, బి.విజయ్ కుమార్, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు, మాతృభాష పరిరక్షణ సమితి కార్యనిర్వాహక కార్యదర్శి పోసిన నాగరాజు, బద్దం కొండల్ రెడ్డి, వడ్డే ఎల్లేష్ , సిహెచ్ రాజు బంగారు శ్రీనివాస్, జేజి నాయన, శ్రీనివాస్ నాయక్ , వెంకటేశం, గోపి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here