శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): గాత్ర, వాద్య, నృత్య రూపాలలో అనేక అరుదైన త్యాగరాజ స్వామి కృతుల ప్రదర్శనలతో 10వ హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం (HTAMF) 2025 ఏ రోజుకి ఆ రోజు కర్ణాటక శాస్త్రీయ సంగీతజ్ఞులకి, సంగీతాభిమానులకి వీనులకింపుగా, కన్నుల పండుగగా సాగిపోతోంది. గురు స్వప్న కృష్ణమోహన్ శిష్యులచే “నౌకాచరిత్రం” కూచిపూడి ప్రదర్శనతో ప్రారంభమైంది. ఈ త్యాగరాజ స్వామి రూపకపు అంతరార్థాన్ని వారు ఎంతో సొగసుగా నృత్యరూపంలో ప్రదర్శించారు. ప్రధాన కచేరీగా విద్వాన్ సి.వి.పి. శాస్త్రి త్యాగరాజ కృతులని అత్యంత సుందరంగా ఆలపించారు. వీరికి విద్వాన్ కె.ఎల్.ఎన్. మూర్తి వయొలిన్ పైన, విద్వాన్ ఎన్.ఎస్. కల్యాణరామన్ మృదంగం పైన, విద్వాన్ ఎస్.ఏ. ఫణిభూషణ్ ఘటం పైన వాద్యసహకారం అందించారు.
ఆ తరువాత విద్వాన్ డి.వి.కె. వాసుదేవన్, విద్వాన్ ద్రోనేంద్ర ఫణికుమార్‌లచే వయొలిన్, వేణు వాద్యాల జంట కచేరీ జరిగింది. వారి సాధికారిక ప్రదర్శన – ప్రత్యక్షంగా వచ్చిన శ్రోతలకి, అంతర్జాలం ద్వారా వీక్షించిన వారికి కూడా – త్యాగరాజ స్వామి కృతులలోని సౌందర్యాన్ని భావస్ఫోరకంగా ఆవిష్కరించింది. విద్వాన్ ఎన్.ఎస్. కల్యాణరామన్ మృదంగం పైన, విద్వాన్ ఎస్.ఏ. ఫణిభూషణ్ ఘటం పైన వాద్యసహకారం అందించారు. అనంతరం ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి ఎస్ రంగరాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్వాంసులని సన్మానించారు. హైదరాబాద్ నగర సాంస్కృతిక రంగానికి తలమానికంగా ఇంత విస్తృత స్థాయికి ఎదిగిన ఈ సంగీతోత్సవాన్ని ఒక తపస్సులా నిర్వహిస్తున్న సంస్కృతి ఫౌండేషన్ వారిని అభినందించారు.
ఈ హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం 10వ సంచిక ఫిబ్రవరి 2వ తేదీ (ఆదివారం) ఉదయం పంచరత్న సేవతో, చివరిగా సాయంత్రం ప్రఖ్యాత విదుషీ మణులు ప్రియ సిస్టర్స్ కచేరీ తో ముగుస్తుంది. అదే సందర్భంలో సంస్కృతి ఫౌండేషన్ వారు ప్రసిద్ధ కర్ణాటక వాయులీన విద్వాంసులు, “నాదసుధార్ణవ” డా. అన్నవరపు రామస్వామికి గురుసన్మానం నిర్వహించనున్నారు.